జాబిల్లి కోసం ఆకాశమల్లే





పిచ్చి బంగారు,
నిన్నరాత్రి అటుపక్కనుంచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా చాలాసేపు నిశబ్దంగా ఉండి తర్వాత పోన్ పెట్టేశావు అది నువ్వే కదా? Iam sure. నువ్వు మాట్లాడనే అక్కరలేదు రా, నీ శ్వాస తీవ్రత చాలు నాకు నువ్వని తెలుసుకోవడానికి. ఇన్ని సంవత్సరాల తర్వాతైనా గుర్తుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.
మన మద్య ఎన్ని మాటలు ఉండేవి ఆ మాటలన్ని ఇప్పుడు ఎక్కడ పోగోట్టుకున్నావురా? అవునులే కలలన్ని కన్నీళ్ళలో కొట్టుకుపోయినపుడు మాటలు ముగిసిపోతాయంట!
అయినా phone అనే ఈ మూగ యంత్రానికి మౌన సందేశాలని రవాణా చేసే అలవాటుంది ఎన్ని లక్షల మంది ఉన్నారో? నాలాంటి వారు, నీలాంటివారు, మాటలు పూర్తికానివారు, మాటలు ముగిసినవాళ్ళు మౌనమే మాటైనవారు.
వద్దులే వదిలేయ్
ఎలా ఉన్నావు రా? నా నుంచి చా………లా….. దూరంగా… నేను మాత్రం నువ్వు వదిలి వెళ్ళిన నిశబ్దంలో నీ జ్ణాపకాలే ఉపిరిగా బ్రతుకుతున్నాను, ఒక్కోక్కసారి చాలా కష్టంగా ఉంటుంది రా.
ఒక్కోక్క సంవత్సరం గడిచిపోతే బాదకూడా తగ్గుతుందేమో అని అనుకున్నాను, కాని సాద్యం కాలేదు రా చెప్పుకున్న మాటలు, నీ ప్రేమ, నీ కోపాలు, నా రాజీలు పెట్టుకున్న ముద్దులు, మన బంగారు కలలు మరిచిపోవడం నా వల్ల కాలేదురా పిచ్చి!
రాత్రంతా మన మొదటి పరిచయపు జ్ణాపకాలే, అప్పుడే మంచులో తడిసిన నందివర్దనం తెలుపు చుడిదార్ వేసుకొని వచ్చిన క్షణంలోనే నేను నిన్ను ఇష్టపడ్డానా అని పదే పదే నా మనసుని ప్రశ్నించుకుంటాను గాని, నిన్ను చాలా చాలా ఇష్టపడటం నాలో మొదలైనపుడు మాత్రం నువ్వు కనకాంబరం రంగు చీర కట్టుకున్నావు అని గుర్తుకొచ్చింది, అవును పిచ్చి నా ఇష్టాలన్ని సేకరించిన నీకు నాకు ఆ కనకాంబరం కలర్ ఇష్టమని తెలిసే ఆరోజు ఆ చీర కట్టుకొని వచ్చావా! అని అడుగుదామనే ప్రశ్నకు నాకు జవాబు చెప్పడానికి వీలు కానంత దూరంలో నువ్వు ఉన్నావని గుర్తొచ్చి దిగులు కమ్ముకుంది.
" అక్షర అక్షరంలో నీ మధుర స్వర ఆలాపన వింటాను పంక్తి పంక్త్తిలో నీ జీవన దృక్కోణం స్వర్శిస్తాను" అంటూ ఎవరో కవి వ్రాసిన మాటలతో నీ ప్రేమ నిండిన ఉత్తరం నన్ను కదిలిస్తూనే ఉంది, వెన్నెల చెట్ల గుబురుల చీకట్లో కలుసుకున్న మధురానుభూతి నా జీవితమంతా పరిమళిస్తూనే ఉంటుంది, మన ఇద్దరి హృదయాల మద్య నలిగిన మల్లెల సువాసన ఇంకా నా శరీరాన్ని పట్టుకునే ఉంది రా
నా ప్రతి శ్వాస నిన్ను కలుసుకొవడానికి, ఎన్నో నీతో చెప్పడానికి బయలుదేరి నువ్వు ఉండాల్సిన చోట ఉండక మోసపోయి బరువెక్కిన బాదతో తిరిగోచ్చేస్తుంది.
నీ రూపాన్నే కళ్ళలో వెలిగించుకొని నీ కోసమే ఎదురు చూస్తూన్నా.
ఏవీ నీ పాదాల గుర్తులు………. ఎక్కడ….. నువ్వు…….
కంటి కిందకి రెండు చారలొచ్చాయి అయినా నువ్వు రాలేదు… ఇంకోన్నాళ్ళకి ఈ చారలే ముడతల్లోకి మారినా కళ్ళకి రెప్పల్ని కప్పుకునే ఆలోచన లేదు.
నువ్వురాని నాలోకంలో నేనుకాని
నేను.